Back

ⓘ బిలాస్‌పూర్, హిమాచల్ ప్రదేశ్. బిలాస్‌పూర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, బిలాస్‌పూర్ జిల్లాలోని పట్టణం. ఇది ఈ జిల్లాకు కేంద్రం కూడా. పట్టణ పరిపాలన మునిసిపల్ కౌన్సిల్ ..
బిలాస్‌పూర్ (హిమాచల్ ప్రదేశ్)
                                     

ⓘ బిలాస్‌పూర్ (హిమాచల్ ప్రదేశ్)

బిలాస్‌పూర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, బిలాస్‌పూర్ జిల్లాలోని పట్టణం. ఇది ఈ జిల్లాకు కేంద్రం కూడా. పట్టణ పరిపాలన మునిసిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతుంది.

                                     

1. చరిత్ర

7 వ శతాబ్దంలో స్థాపించబడిన అదే పేరు గల రాష్ట్రానికి బిలాస్‌పూర్ రాజధానిగా ఉండేది. దీనిని కహ్లూర్ అని పిలిచేవారు. పాలక రాజవంశం చందేల్ రాజ్‌పుత్రులు, ప్రస్తుత మధ్యప్రదేశ్‌లోని చందేరి పాలకుల వంశీకులు. బిలాస్‌పూర్ పట్టణాన్ని 1663 లో స్థాపించారు. ఆ తరువాత ఈ రాష్ట్రం బ్రిటిష్ ఇండియాలో సంస్థానంగా మారింది. బ్రిటిష్ ప్రావిన్సయిన పంజాబ్లో భాగంగా ఉండేది.

1665 మే 13 న గురు తేజ్ బహదూర్ బిలాస్‌పూర్‌కు చెందిన రాజా దీప్‌చంద్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బిలాస్‌పూర్ వెళ్లాడు. బిలాస్‌పూర్‌ రాణి చంపా తన రాష్ట్రంలోని కొంత భూమిని తీసుకొమ్మని గురువుకు ప్రతిపాదించింది. గురువు 500 రూపాయలు చెల్లించి తీసుకున్నాడు. అందులో లోధీపూర్, మియాపూర్, సహోటా గ్రామాలు అందులో ఉన్నాయి. గురు తేజ్ బహదూర్ 1665 జూన్ 19 న ఒక కొత్త గ్రామాన్ని స్థాపించాడు, దీనికి అతను తన తల్లి పేరు మీద నానకి అని పేరు పెట్టాడు.

1954 జూలై 1 న భారత పార్లమెంటు చట్టం ద్వారా బిలాస్‌పూర్ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రలో ఒక జిల్లాగా మారింది. సట్లెజ్ నదికి ఆనకట్ట కట్టడంతో ఏర్పడిన గోవింద్ సాగర్ జలాశయంలో చారిత్రిక పట్టణం బిలాస్‌పూర్ మునిగిపోయింది. పాత పట్టణానికి ఎగువన కొత్త పట్టణాన్ని నిర్మించారు.

                                     

2. భౌగోళికం

బిలాస్‌పూర్ 31.33°N 76.75°E / 31.33; 76.75 నిర్దేశాంకాల వద్ద ఉంది పట్టణం సముద్రమట్టం సగటున 673 మీటర్ల ఎత్తున ఉంది. ఇది బండ్లా కొండల పాదాల వద్ద, సట్లెజ్ నదికి ఎడమ గట్టున ఉంది. మనాలికి వెళ్లే మార్గంలో హిమాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిన తరువాత తారసిల్లే మొదటి ప్రధాన పట్టణం ఇదే.

                                     

3. శీతోష్ణస్థితి

బిలాస్‌పూర్‌లో వెచ్చని వేసవికాలం, చల్లని శీతాకాలాలుంటాయి. ఇద్ లోయలో ఉండడం వలన చుట్టుపక్కల ఉన్న పర్వతాల వలన ఏర్పడే విపరీత ఉష్ణోగ్రతల తాకిడి నుండి దూరంగా ఉంటుంది. జూలై నుండి సెప్టెంబరు వరకు ఉండే రుతుపవనాల కాలం, అధిక వర్షపాతం ఉన్న కాలం. అక్టోబరు నుండి నవంబరు వరకు గోవింద్ సాగర్ జలాశయం పూర్తిగా నిండి ఉంటుంది. మే, జూన్ లలో అత్యధిక ఉష్ణోగ్రతలుంటాయి. ఉష్ణోగ్రత సాధారణంగా 37 °C 99 °F - 38 °C 100 °F ఉంటుంది. కొన్నిసార్లు 40 °C 104 °F కంటే ఎక్కువగానూ ఉంటుంది.

                                     

4. జనాభా

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, బిలాస్‌పూర్ జనాభా 13.058. జనాభాలో పురుషులు 56.25%, మహిళలు 43.75%. బిలాస్‌పూర్ అక్షరాస్యత 91%, ఇది జాతీయ సగటు 74% కంటే ఎక్కువ. జనాభాలో 10% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు. ఇక్కడ చాలా మంది ప్రజలు నగరంలో నివసిస్తున్నారు. లేదా శివారు గ్రామీణ ప్రాంతాల నుండి పని కోసం వస్తూంటారు. పట్టణంలో ఎక్కువ మంది సేవల రంగంలో పనిచేస్తున్నారు.

                                     

5. చూడదగ్గ ప్రదేశాలు

 • కాండ్రౌర్ వంతెన
 • మార్కండేయ ఆలయం
 • గోవింద సాగర్ జలాశయం
 • లక్ష్మీ నారాయణ ఆలయం
 • గుగ్గ గెర్విన్ ఆలయం
 • బడోయి దేవి ఆలయం: దుర్గాదేవి ఆలయం
 • బాబా నహర్ సింగ్ ఆలయం, ధౌల్రా
 • భాక్రా ఆనకట్ట: సట్లెజ్ నదిపై కట్టిన ఆనకట్ట. దీని నిర్మాణంతో గీవింద సాగర్ జలాశయం ఏర్పడింది.
 • వ్యాసగుహ
 • హడింబా దేవి ఆలయం: దుర్గాదేవి ఆలయం
 • నైనా దేవి ఆలయం: నైనాదేవి ఆలయం బిలాస్‌పూర్‌లోని ఒక కొండపై ఉంది. ఈ ఆలయం జాతీయ రహదారి -21 పక్కనే ఉంది. కొండ పైకి కొంత దూరం వాహనంపై వెళ్ళి అక్కడి నుండి కాలినడకన చేరుకోవాలి. కొండ దిగువ నుండి పైకి వెళ్ళేందుకు కేబుల్ కార్ సౌకర్యం కూడా ఉంది. కొండ పైనుండి గోవింద సాగర్ జలాశయాన్ని చూడవచ్చు.
 • రుక్మిణీ కుండ్
 • బాబా బాలక్ నాథ్: పంజాబు హిమాచల్ లలో హుందువులు పూజించే దైవం
                                     

6. రవాణా

బిలాస్‌పూర్ పట్టణం, చండీగఢ్ - మనాలి జాతీయ రహదారి -205 పైన ఉంది. ఇది సిమ్లా నుండి 86 కి.మీ., ఢిల్లీ నుండి 405 కి.మీ. దూరంలో ఉంది. సమీప ప్రధాన విమానాశ్రయం 141 కి.మీ. దూరం లోని చండీగఢ్ లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన మనాలి బిలాస్‌పూర్ నుండి 195 కి.మీ. దూరంలో ఉంది. మండీ 70 కి.మీ దూరంలో ఉంది. ప్రభుత్వ యాజమాన్యంలోని హెచ్‌ఆర్‌టిసి, బిలాస్‌పూర్‌ నుండి దూరప్రాంతాలకు బస్సులు నడుపుతోంది. స్థానిక మార్గాల్లో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు నడుపుతున్నారు.

                                     

7. పట్టణ ప్రముఖులు

 • యామి గౌతమ్, బాలీవుడ్ / టెలివిజన్ నటి
 • సంజయ్ కుమార్, పరమ్ వీర్ చక్ర గ్రహీత
 • జగత్ ప్రకాష్ నడ్డా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాజీ మంత్రి
 • రతన్ చంద్, సీనియర్ బ్యూరోక్రాట్, భారత ప్రభుత్వం; సలహాదారు, ప్రపంచ బ్యాంక్